NANDYAL April 08:- నంద్యాల జిల్లా,మిడుతూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు పారదర్శకంగా, వేగవంతంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఫేజ్-3, ఫేజ్-4 కింద ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయిందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రీ-సర్వే పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవని గ్రామ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్, సంబంధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Arattai