NANDYAL May03 :- నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో 1998-2001 బ్యాచ్ బి.కాం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.కోర్సు పూర్తి చేసి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ “రజతోత్సవ వేడుకలు” నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.కార్యక్రమంలో డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు అది విద్యాసంస్థకు, గురువులకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమించి నేడు వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పునాదులు వేసిన ఆనాటి అధ్యాపకులను విద్యార్థులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వెండి పండగ (Silver Jubilee) వేళ గురువుల ఆశీస్సులు తీసుకోవడం తమ అదృష్టమని విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.

దాదాపు పాతికేళ్ల తర్వాత తమ క్లాస్‌మేట్స్‌ను కలుసుకోవడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనాటి కాలేజీ రోజులను, తీపి జ్ఞాపకాలను విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకున్నారు. పాత మిత్రులను చూసి మురిసిపోతూ, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధ్యాపక బృందం, 1998-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai