NANDYAL May24 :- జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తేదీ (సోమవారం)న జిల్లా వ్యాప్తంగా “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమ సమయాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను నేరుగా సమర్పించడంతో పాటు, meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా, దాఖలు చేసిన అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ స్థాయి కార్యాలయాల్లో అధికారులకు వినతులు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.
Arattai