NANDYAL May23 :- గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో కులగణన సర్వేను ఖచ్చితత్వంతో నిర్వహించాలని డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం నిర్వహిస్తున్న నేపథ్యంలో… బీసీ సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలను డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ (రిటైర్డ్) స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి డి.సి.ఎస్. రాజు, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి చింతామణి, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని బీసీ జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను సేకరించాలని అధికారులను సూచించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి విశ్వసనీయమైన డేటాను సిద్ధం చేయాలన్నారు. కులగణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీలు సహా వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి, వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీల్లో బీసీలు ఎంతమంది ఎన్నికయ్యారు అనే వివరాలను సమగ్రంగా సేకరించాలని సూచించారు. కులగణనకు సంబంధించిన డేటా మైగ్రేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలియజేయగా, సర్వే ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతతో నిర్వహించాలని కమిషన్ ఛైర్మన్ ఆదేశించారు.
సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే వారం రోజుల్లో సూపర్ చెక్ నిర్వహించి, తనిఖీ నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని అధికారులను సూచించారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బీసీ కులాల కవరేజ్ ఎలా ఉందన్న అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ కులాలకు చెందిన విద్యార్థుల నమోదు వివరాలు (ఎన్రోల్మెంట్) సేకరించాలని సూచించారు. సర్వేకు సంబంధించిన వివరాలను త్వరలో గ్రామసభల్లో ప్రదర్శించి ప్రజల ధృవీకరణకు ఉంచనున్నట్లు తెలిపారు. పేర్లు, విద్యార్హతలు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునే అవకాశం కల్పించి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎస్జీఎస్డీ శాఖ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించి జిల్లాలకు పంపనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డెడికేటెడ్ కమిషన్‌కు అందిన వినతులు
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలో వాల్మీకులు మొదటి స్థానంలో ఉన్నారని, వారిని ఎస్టీ లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి నాయకులు కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచడం ద్వారా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలని కోరారు.
జిల్లాలో వడ్డెర బాతి సుమారు రెండు లక్షల జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా వెనుకబాటుతనంలో ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఆధునిక పరిశ్రమలు, యంత్రాల వినియోగం పెరగడంతో విశ్వబ్రాహ్మణులకు చెందిన సంప్రదాయ చేతివృత్తులు క్షీణిస్తున్నాయని, కుటుంబ పోషణతో పాటు చేతివృత్తుల సంరక్షణ కోసం ఉపాధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ (భక్తజన) సేవా సంఘం నాయకులు కమిషన్ ఛైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు.
Arattai