NANDYAL May23 :- వ్యవసాయ మౌలిక వసతుల నిధి (AIF) పథకం కింద జిల్లాలో నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ (MPFC) గోదాముల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ సహకార అధికారులను ఆదేశించారు. శనివారం జేసీ ఛాంబర్ లో గోదాముల పురోగతిపై జిల్లా స్థాయి అమలు కమిటీ (DLIC) 9వ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ (MPFC) గోదాముల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న మూడు గోదాముల నిర్మాణ పనులను 30 రోజులలోగా పూర్తి చేసి సంబంధిత సహకార సంఘాలకు అప్పగించాలని మార్కెటింగ్ శాఖ డిఇని ఆదేశించారు. అలాగే పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిర్మాణం పూర్తయి ఇంకా అప్పగించని గోదాములకు సంబంధించిన పనులను పూర్తి చేసి, నివేదికలను 15 రోజులలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పూర్తి అయిన గోదాములకు రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పథకం అమలులో భాగంగా సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి ఎన్. రామాంజనేయులు, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీసీసీబీ అధికారులు, నాబార్డ్ ప్రతినిధులు, వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన, విద్యుత్ శాఖల అధికారులు సంబంధిత PACS సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Arattai