NANDYAL June 04:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల కె.ఎన్.ఎం. మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రధానాంశం “వాతావరణ మార్పు” అని తెలిపారు.

వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న సవాళ్లపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల ద్వారా నీటి పొదుపు, విద్యుత్ పొదుపు, ఈ-వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థి తమ అమ్మ పేరు మీదుగా ఒక మొక్క నాటాలని సూచించారు.

జిల్లా సైన్స్ ఆఫీసర్ సుందర రావు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుక్రవారం బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షా కోఆర్డినేటర్ నాగేంద్రకుమార్ , ఉపాధ్యాయులు దేవనాల శ్రీనివాసులు,అన్నెం శ్రీనివాసరెడ్డి,సుబ్బారెడ్డి,అవ్వారి శేషఫణి తదితరులు పాల్గొన్నారు
Arattai