ALLAGADDA June05:- భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పాఠశాలలను ‘నెట్ జీరో వేస్ట్ – హెల్తీ క్యాంపస్’లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘అనంత అరణ్య’ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాల ఆవరణలో అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ (అనంత అరణ్య) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు మొక్కలు నాటి హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని, అనంత అరణ్య వంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ద్వారా పచ్చదనాన్ని విస్తరించాలని, ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

అనంత అరణ్య కార్యక్రమం కింద తొలి విడతలో జిల్లాలోని 50కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)తో పాటు ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో పాఠశాలల్లో మొక్కల పెంపకంతో పాటు సోక్పిట్లు, కంపోస్ట్ పిట్లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, కిచెన్ గార్డెన్లు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి పర్యావరణహిత చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలను ‘నెట్ జీరో వేస్ట్ – హెల్తీ క్యాంపస్’ లుగా అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించి సమాజంలో సుస్థిర మార్పుకు బాటలు వేయడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.,

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జిల్లాలో తొలి విడతగా 56 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థలకు విస్తరించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆళ్లగడ్డ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో అమలు చేసి విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai