NANDYAL June05:- చేతులు కోల్పోయిన అర్హులైన దివ్యాంగులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి సంబంధించిన ప్రచార గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల సాధికారత, స్వావలంబన పెంపు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్ఎన్-4 హ్యాండ్స్ మరియు చేయూత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో చేతులు కోల్పోయిన అర్హులైన దివ్యాంగులకు సుమారు రూ.30 వేల విలువైన అత్యాధునిక కృత్రిమ చేతులను పూర్తిగా ఉచితంగా అమర్చనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నంద్యాల జిల్లాకు చెందిన అర్హులైన లబ్ధిదారులు ముందస్తుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఎల్ఎన్-4 హ్యాండ్స్ సాంకేతికతతో రూపొందించిన ఈ కృత్రిమ చేతులు వినియోగదారులు రాయడం, పెయింటింగ్ చేయడం, ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వంటి రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించేందుకు తోడ్పడటమే కాకుండా, సుమారు నాలుగు కిలోల వరకు బరువును ఎత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దివ్యాంగులు మరింత ఆత్మవిశ్వాసంతో స్వతంత్ర జీవనం గడపగలరని ఆమె పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికితీసి, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపేందుకు నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ మానవతా దృక్పథంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని కలెక్టర్ తెలిపారు. శిబిరానికి సంబంధించి రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాల కోసం నంద్యాల కె.సి. కెనాల్ కాంపౌండ్ ఆవరణలోని రెడ్ క్రాస్ కార్యాలయాన్ని లేదా 89857 70583 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Arattai