NANDYAL June21 :- యోగం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.

ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించినట్లు తెలిపారు. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో ఒక్కో చోట దాదాపు రెండు వేల మంది చొప్పున పాల్గొనడం విశేషమన్నారు. యోగా అసోసియేషన్ల సహకారంతో నిర్వహించిన థీమాటిక్ యోగా కార్యక్రమాలు కూడా ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 4,700 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములై యోగాపై తమ ఆసక్తిని చాటుకున్నారని వెల్లడించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని కలెక్టర్ పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ “యోగ ఫర్ హెల్దీ ఏజింగ్” కావడంతో ప్రతి ఒక్కరూ తమ వయస్సు, శారీరక పరిస్థితులకు అనుగుణంగా యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత తప్పనిసరిగా యోగా సాధన అలవాటు చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులలో చదువుపై ఆసక్తి, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అసెంబ్లీ సమయంలో యోగా నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ప్రతిరోజూ యోగా సాధనకు సమయం కేటాయించాలని కోరారు. యోగా ద్వారా విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఎదుగుతారని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యుత్తమ సంపదలలో ఒకటని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో పరధ్యానాలు ఉన్నప్పటికీ యోగా మనలోని శక్తిని లక్ష్యసాధన వైపు కేంద్రీకరించగలదన్నారు. ముఖ్యంగా విద్యార్థులు రోజుకు 20 నుండి 30 నిమిషాలు యోగా సాధన చేస్తే తమ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలరని చెప్పారు. నిత్యం బిజీ జీవితాన్ని గడిపే ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం, సాయంత్రం లేదా కార్యాలయాల్లో లభించే కొద్ది సమయాన్ని కూడా యోగా సాధనకు వినియోగించుకోవచ్చని సూచించారు. యోగా ఒక రోజు కార్యక్రమంగా కాకుండా జీవితాంతం కొనసాగించే ఆరోగ్యకరమైన అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కనీసం మరో ఐదుగురికి యోగా ప్రాముఖ్యతను వివరించి వారిని కూడా యోగా వైపు ప్రోత్సహించాలని కోరారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్ యోగా తెరపిస్ట్ మయూరాసనం, శిరశాసనం, సర్వాంగాసనం, చక్రాసనం, బకాసనం వంటి యోగాసనాలను వేసి ప్రాముఖ్యతను వివరించారు. పాణ్యం మండలం విద్యార్థులు సమన్వయ యోగా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

యోగాంధ్ర-2026 విజయవంతానికి సహకరించిన యోగ చైతన్య కేంద్ర,అమర యోగ వికాస కేంద్రం,ఇషా ఫౌండేషన్, హార్ట్ఫుల్నెస్, రాపర్తి రామ అకాడమిక్ ఆఫ్ యోగి సైన్సెస్, రామకృష్ణ నేచురోపతి అండ్ యోగా,ఆకాంక్ష యోగా సమితి, సంస్థలు, ప్రజాపిత బ్రహ్మకుమారీస్, శ్రీ సత్యసాయి ధ్యాన మండలి, స్పోర్ట్స్ యోగాసన అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. అలాగే 14 రోజులపాటు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, క్రీడా అభివృద్ధి శాఖ, పోలీసు శాఖ, సివిల్ సప్లైస్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి, జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ప్రజలందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Arattai