NANDYAL June28 :- నంద్యాల మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి వేడుకలను ఆదివారం సాయిబాబా నగర్‌లోని రాహుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పీవీ నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేసిన సంస్కరణల రూపశిల్పి పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆర్థికవేత్తగా, దూరదృష్టి కలిగిన ప్రధానమంత్రిగా ఆయన భారతదేశ అభివృద్ధికి విశిష్ట కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.

అనంతరం నిర్వహించిన పీవీ నరసింహారావు జీవిత విశేషాలపై చర్చాగోష్టిలో ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి మాట్లాడుతూ, ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహారావు గారు నంద్యాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ రూపొందించిన “నరసింహ” పత్తి వంగడాన్ని ఆవిష్కరించడం నంద్యాల చరిత్రలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. సీనియర్ రొటేరియన్ డి.వి సుబ్బయ్య మాట్లాడుతూ బ్రాడ్ గేజ్ రైల్వే, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు పీ.వీ. విశిష్ట సేవలు అందించారన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ కు నరసింహ రాయసాగర్ గా పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా తెలుగు పండితులు అన్నెం శ్రీనివాసరెడ్డి, కవి నీలకంఠమాచారి, మహబూబ్ బాషా తదితరులు పీవీ నరసింహారావు జీవితం, వ్యక్తిత్వం, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రతిబింబించే కవితలను వినిపించారు.కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు నరసింహులు, మాజీ కార్యదర్శి ప్రసాద్‌తో పాటు రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
Arattai