NANDYAL June29 :- ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో భారతరత్న, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బి.సి.రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా,గౌరవ అతిధిగా ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు,రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొన్నారు.ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డాక్టర్ బి. సి.రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ వైద్యుల దినోత్సవ పురస్కారాలను డాక్టర్ తారకేశ్వర రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర రెడ్డి, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సునీత,నీట్ పి.జి. పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించిన డాక్టర్ నెరవాటి గగన్ లకు ఎంపీ అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వైద్యులు రోగి ప్రాణాలు కాపాడడానికి శాయ శక్తుల ప్రయత్నం చేస్తారని, వైద్యో నారాయణో హరి గా భారత సంస్కృతిలో చెప్పారన్నారు. నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఐఎంఏ భవన నిర్మాణానికి వైద్యురాలిగా సహకారం అందజేస్తామన్నారు. రాష్ట్ర వైద్యుల రక్షణ చట్టం సవరించడం, కేంద్ర వైద్యుల రక్షణ చట్టం కోసం, ఏక గవాక్ష విధానంలో ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సరళీకృతం చేయడానికి, వైద్యులు, వైద్య సిబ్బందిపై కేసులు నమోదు చేసే సమయంలో పాటించవలసిన నిర్దిష్ట నిబంధనావళి రూపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ దేశంలో 1928లో ప్రారంభించబడిందని ఇప్పుడు 35 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1750 బ్రాంచీలలో నాలుగు లక్షల మంది సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద వృత్తి స్వచ్ఛంద సంస్థ ఐఎంఏ అని అన్నారు.దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 బ్రాంచ్ లలో ఇరవై మూడు వేల మంది ఐఎంఏ సభ్యులు అటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఎంపీ డాక్టర్ పై రెడ్డి శబరిని నంద్యాల వైద్యులు ఘనంగా సత్కరించి అభినందించారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు,వైద్యుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వివిధ క్రీడా, సంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు,డాక్టర్ మధుసూదన రావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్,నంద్యాల శాఖ మహిళా విభాగ నాయకులు డాక్టర్ నర్మద ,డాక్టర్ నాగమణి, డాక్టర్ హరిత ,డాక్టర్ సునీత, డాక్టర్ లలిత, డాక్టర్ ఆరిఫా బాను అధిక సంఖ్యలో వైద్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
Arattai