NANDYAL July07 :- ఈ నెల 9వ తేదీన బనగానపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వీరి వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, తహసీల్దార్ కార్యాలయం, ప్రజా వేదికతో పాటు ఇతర కీలక ప్రాంతాలను సందర్శించి వివిధ శాఖల అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో, ప్రతి శాఖ అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏర్పాట్లలో నాణ్యత, సమన్వయం, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిసర ప్రాంతాలను పూర్తిగా సిద్ధం చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌కు వెళ్లే రహదారులు, బ్యారికేడింగ్, భద్రతా వలయం, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజా వేదిక వద్ద సభా ప్రాంగణాన్ని సక్రమంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు, షామియానాలు, కుర్చీలు, విద్యుత్, సౌండ్ సిస్టమ్, వైద్య శిబిరం, అగ్నిమాపక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని పోలీసు శాఖకు మంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చోట వెంటనే సవరణలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షోరాన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, బందోబస్తు, జనసంచార నియంత్రణ, అత్యవసర స్పందన బృందాలు, అగ్నిమాపక, వైద్య సేవలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. భద్రతా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమం జరిగే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా ప్రతి శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Arattai