NANDYAL July14 :- భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశాల మేరకు 01.07.2026 అర్హత తేదీతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) కార్యక్రమానికి సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం తెలిపారు.
భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO), ఆంధ్రప్రదేశ్ సంబంధిత అధికారులకు సవరించిన కార్యాచరణ షెడ్యూల్‌ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 24 వరకు కొనసాగనుందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను జూలై 24 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనుండగా, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించబడతాయని కలెక్టర్ తెలిపారు.
అనంతరం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను విచారించి పరిష్కరించే ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 3, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందని కలెక్టర్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన సవరించిన షెడ్యూల్‌ను సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రజలకు ఈ షెడ్యూల్‌పై పూర్తి అవగాహన కల్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సవరించిన షెడ్యూల్‌ను లిఖితపూర్వకంగా తెలియజేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశించారు.
Arattai