NANDYAL July21 :- నంద్యాల మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో మధుమణి చారిటబుల్ సొసైటీ తరపున సోమవారం మొదలైన 36వ ఉచిత శస్త్ర చికిత్సల శిబిరంలో మొదటిరోజు చేసిన వైద్య పరీక్షలలో ఎంపికైన వారికి మంగళవారం నుండి శస్త్ర చికిత్సలు చేయడం ప్రారంభించారు.ఈ ఉచిత శస్త్ర చికిత్సల కార్యక్రమాన్ని మధుమణి ఆపరేషన్ థియేటర్ వద్ద రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ మణిదీప్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ 36 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి పి 4 కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 100 కుటుంబాలలోని వారికి 50 లక్షలు విలువ చేసే 100 శస్త్ర చికిత్సలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పేదలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

నంద్యాల నియోజకవర్గంలో పలు మండల కేంద్రాలలో ఆసుపత్రులను ఆధునీకరణ చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ తమతోపాటు దేశంలో పేరెన్నిక గన్న ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని అత్యున్నతస్థాయి ప్రమాణాలతో,అత్యంత ఖరీదైన పరికరాల వినియోగంతో శస్త్ర చికిత్సలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు 200 మందికి ఉచితంగా ఓపిడిలో పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నామన్నారు.ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ మధుసూదనరావు సేవలు నంద్యాల ఐఎంఏ కు గర్వకారణం అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఈ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వారు ఎవరూ లేరని ప్రశంసించారు. డాక్టర్ మధుసూదనరావు సేవలు వైద్యులకు స్ఫూర్తి దాయకమన్నారు.

ఈ సందర్భంగా మధుమణి ఆసుపత్రి, నంద్యాల ఐఎంఏ తరపున మంత్రి ఫరూక్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిత్, నంద్యాల ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, మధుమణి కుటుంబ సభ్యులు సింధు, చిత్తలూరు శేష ఫణి, ప్రభుత్వ పి 4 కార్యక్రమం కోఆర్డినేటర్ చెన్నయ్య,చికిత్సల కోసం వచ్చిన రోగులు వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Arattai