నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అభయ డే నిర్వహణ
NANDYAL Aug09:- నంద్యాల ప్రసూతి ,స్త్రీ వ్యాధి వైద్యుల సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ డే కార్యక్రమాన్ని సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధ, కోశాధికారి డాక్టర్ సునీతల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ 2024లో కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన మహిళా వైద్యురాలి హత్య ఘటన అనంతరం వైద్య సిబ్బంది భద్రతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైందన్నారు.
ఆసుపత్రులలో వైద్యులు,నర్సులు, ఇతర ఆరోగ్య రక్షణ సిబ్బందిపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండించడంతో పాటు, విధులు నిర్వహించే సమయంలో వారికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అభయ డేను దేశవ్యాప్తంగా జాతీయ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య సేవలు అందించే వైద్య సిబ్బంది భయాందోళనలకు గురికాకుండా విధులు నిర్వర్తించేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై, సమాజంపై ఉందన్నారు.ఆరోగ్య సిబ్బందిపై హింసకు తావులేకుండా సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో వైద్య సిబ్బంది రక్షణ చట్టం సత్వరమే తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.
ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ రోగి మరణించిన సందర్భంగా కానీ, ఏదైనా ఇబ్బంది తలెత్తిన సమయంలో రోగి బంధువులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు శాఖ సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా అనుసరించాల్సిన నిర్దిష్ట విధివిధానాలు రూపొందించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని కోరారు.గైనకాలజీ వైద్యుల సొసైటీ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి సమావేశంలో పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది 2008 రక్షణ చట్టాన్ని సవరించి, వైద్య సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడిన వారికి ఇప్పుడు ఉన్న రెండు సంవత్సరాల కారాగార శిక్షను ఏడు సంవత్సరాలకు పెంచి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి అనువుగా కఠిన తరం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధ రాణి, కోశాధికారి డాక్టర్ సునీత, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ నాగ రేఖ,డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ శిల్ప,డాక్టర్ శశి కిరణ్, డాక్టర్ దివ్య తేజ, డాక్టర్ గింజుపల్లి అనూష పాల్గొన్నారు.
Arattai