స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి : కలెక్టర్ జి. రాజకుమారి.
NANDYAL Sep 19 :- స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొని పరిసరాలను పరిశీలించారు. కార్యాలయాల ఆవరణలో ఎక్కడా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించకుండా ప్రతిరోజూ పరిశుభ్రతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ, పచ్చదనం, మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి కార్యాలయాన్ని పరిశుభ్రతకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లా, రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డుల కోసం కలెక్టరేట్, శిశుగృహ (స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ), ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నుంచి నాలుగు నామినేషన్లు పంపించినట్లు తెలిపారు. నామినేట్ చేసిన కార్యాలయాల్లో పరిశుభ్రత ప్రమాణాలు, పరిసరాల నిర్వహణ, పచ్చదనం తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి అవార్డులకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. థర్డ్ పార్టీ తనిఖీ బృందాలు సోమవారం నుంచి ఎప్పుడైనా కార్యాలయాలను సందర్శించే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలు కనిపించిన వెంటనే తొలగించాలని, పరిశుభ్రత లోపాలు పునరావృతం కాకుండా బాధ్యతలను సిబ్బందికి స్పష్టంగా కేటాయించాలని కలెక్టరేట్ ఏఓ ను ఆదేశించారు. కార్యాలయం లోపల, బయట పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్ల శుభ్రత, చెత్త నిర్వహణ, మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం అక్టోబర్ 2తో ముగిసినా, కార్యాలయాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ఉద్యోగి స్వచ్ఛతను తమ బాధ్యతగా స్వీకరించి, ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన కార్యాలయ వాతావరణాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Arattai