గురజాడ–గొట్టిముక్కల సాహితీ సేవలు చిరస్మరణీయం
NANDYAL Sep20 :- నంద్యాల పట్టణంలోని నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఆదివారం మహాకవి గురజాడ అప్పారావు, విశ్రాంత ఉపాధ్యాయులు, శతాధిక గ్రంథాల రచయిత కీ.శే. గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు,సాహిత్యాభిమానులు పాల్గొని గురజాడ అప్పారావు, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా తెలుగు భాషకు జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. సామాజిక చైతన్యం, మానవతా విలువలు, సమాజ సంస్కరణకు గురజాడ రచనలు బలమైన పునాదులు వేశాయని పేర్కొన్నారు. అలాగే గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి శతాధిక గ్రంథాలను రచించి నంద్యాల సాహిత్య కీర్తిని ఇనుమడింపజేశారని, ఆయన సాహితీ సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గేలివి సహదేవుడు మాట్లాడుతూ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి జీవిత విశేషాలను, సాహితీ సేవలను వివరించారు. ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే విస్తృతంగా రచనలు చేసి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని తెలిపారు. శతాధిక గ్రంథాల రచయితగా నంద్యాల సాహిత్య చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ తెలుగు భాషకు వన్నెతెచ్చిన మహాకవి గురజాడ అప్పారావు వర్తమాన కవులకు అడుగుజాడ అని అన్నారు.

గురజాడ రచనల్లోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మాతృభాష పట్ల అభిమానం పెంపొందించడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం “తెలుగు భాషా వైభవం” అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి డా. నీలం వెంకటేశ్వర్లు, చిన్నయ్యసూరి సాహితీ సమితి అధ్యక్షులు డా. రమణమూర్తి, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, రచయిత డా.కిశోర్ కుమార్ ,అవధాని డా. గంగుల నాగరాజు, చందన్, రాఘవేంద్ర శర్మ తదితరులు పాల్గొని తెలుగు భాష ప్రాచీనత, సాహిత్య వైభవం, మాతృభాష పరిరక్షణ అవసరం, భావితరాల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన ఆవశ్యకతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కవులు మహబూబ్ బాషా, నీలకంఠమాచారి “కమ్మనైన అమ్మ భాష” అనే అంశంపై కవితలు వినిపించి సభికులను ఆకట్టుకున్నారు. ఇటీవల ఫిన్లాండ్ దేశ విద్యావిధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆ దేశ విద్యా విధానంలో మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, సృజనాత్మకత, అభ్యసన సామర్థ్యాల అభివృద్ధిలో మాతృభాష కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి,వెంక ట సుబ్బయ్య విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్సుబ్బారెడ్డి, సర్వేపల్లి పురస్కార గ్రహీత మహమ్మద్ రఫీ, మోహన్, చందన్ తదితరులను నంది రైతు సమాఖ్య నాయకులు రామసుబ్బారెడ్డి,కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఓబులపతి, నాగరాజరావుకైలాసనాథ్ రెడ్డి, *మాధవస్వామి తదితర సమాఖ్య సభ్యులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. మాతృభాషను పరిరక్షించుకోవడం ద్వారా తెలుగు భాషతో పాటు మన సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, జీవన విలువలను భావితరాలకు అందించవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
Arattai