వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి:ఎస్పీ సునీల్ షరాన్
NANDYAL Aug22 :- వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తెలిపారు.*శనివారం కలెక్టరేట్ లోనే వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నిమజ్జన పై జిల్లా ఎస్పీ సునీల్ షరాన్, డి ఆర్ ఓ రాము నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలనీ తెలిపారు. 2024, 2025 సంవత్సరాల్లో చేపట్టిన విధంగానే ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మరింత సమర్థవంతంగా ఏర్పాట్లును చేయాలని సూచించారు.సెప్టెంబర్ 14 న వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. ఉత్సవాలు, నిమజ్జన తేదీలు ముందుగానే ఖరారు చేసి, అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్ నుంచి 2,500 మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రహదారుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆత్మకూరు బస్టాండ్ నుంచి చిన్న చెరువు వరకు నిమజ్జన ఊరేగింపులు జరిగే మార్గాల్లో ఉన్న గుంతలను ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే పూడ్చి రహదారులను సురక్షితంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఊరేగింపుల సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిమజ్జన, ఊరేగింపు మార్గాల్లో ఎక్కడా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిమజ్జన కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న చెరువు వద్ద ఐదు నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేఎసీ కెనాల్ అధికారులతో సమన్వయం చేసుకుని నిమజ్జనానికి అవసరమైన స్థాయిలో నీటి మట్టాన్ని నిర్వహించాలని సూచించారు. నిమజ్జన కేంద్రాల వద్ద 24 గంటల లైటింగ్, పారిశుధ్యం, తాగునీరు, జనరేటర్లు, ఫైర్ సేఫ్టీ, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి నీరు సరిపోని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఈతగాళ్లు, పడవలు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలనీ తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిమజ్జన ప్రదేశాల వద్ద అవసరమైన సంఖ్యలో పుట్టీలు, పడవలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అధికారులు 24/7 షిఫ్టుల వారీగా విధుల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, రవాణా శాఖలు ముందుగానే రూట్ డైవర్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు మంచి కండిషన్లో ఉన్న క్రేన్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య, అత్యవసర సేవలు సిద్ధంగా ఉండాలనీనిమజ్జన ప్రదేశాల వద్ద 108, 104 అంబులెన్సులతో పాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవలకు నంద్యాల జీసీహెచ్ ఆసుపత్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఎన్నికల పనులు కూడా సమాంతరంగా పూర్తి చేయాలనీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల పరిశీలన, ఓటర్ల జాబితా తదితర పనులను గణేష్ ఉత్సవాల ఏర్పాట్లతో పాటు సమాంతరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు, ఉత్సవాల ఏర్పాట్లలో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల వారీగా బాధ్యతలు స్పష్టంగా కేటాయించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు .

ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు శాంతిభద్రతలు, భద్రతా దిశగా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే పండుగలు, కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు.

వినాయక చవితి సందర్భంగా ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేసి ట్రాఫిక్ మళ్లింపు పార్కింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. విగ్రహాల సంఖ్య, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి జిల్లా స్థాయికి నివేదించాలని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఎక్కడైనా ముందస్తుగా సమస్యలు లేదా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే వాటిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిలో పర్యవేక్షించాలన్నారు.

జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాలుగా ఉన్నప్పటికీ ప్రజల సమైక్య సహకారం, పోలీసు శాఖ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సమన్వయం, సంయమనం, సామాజిక బాధ్యతతో వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని అన్నారు.
Arattai