సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో గురజాడ జయంతి
NANDYAL Sep21 :- నంద్యాల జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మహాకవి, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నంద్యాలలోని పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సాహిత్య సభలో సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎం. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలకు బలమైన పునాది వేశారని, సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలను ప్రశ్నిస్తూ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. ప్రధాన కార్యదర్శి డా. నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గురజాడ రచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ముఖ్యంగా కన్యాశుల్కం, ముత్యాల సరాలు వంటి రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడిని తీసుకువచ్చారని పేర్కొన్నారు.మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గురజాడ కేవలం కవి మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే ఆయన సందేశం సమాజం పట్ల ప్రతి పౌరుడి బాధ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు. వక్తలు అవ్వారి శేషఫణి,మాబుబాష, గ్రంథాలయాధికారి మధులు మాట్లాడుతూ, గురజాడ తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేయడానికి వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో కవులు నీలకంఠమాచారి,,కొప్పుల ప్రసాద్ , రఫీలు వినిపించిన కవితలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు మనోహ, శ్రీనివాసులు,రామకృష్ణ,ఆదినారాయణ సాహితీ మిత్రులు, భాషాభిమానులు పాల్గొన్నారు.
Arattai