అమరావతి: భవిష్యత్తు అంతా పర్యాటకానిదే అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్ లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. డబ్ల్యూటీఎం ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు.
ఈ సందర్భంగా డబ్ల్యూటీఎం సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలుపుతూ ఏపీకి రండి… స్థానిక పర్యాటక ప్రదేశాలను సందర్శించండి.. పర్యాటక, ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏపీ పర్యాటక అభివృద్ధికి దోహదపడండి అని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లను కోరారు..
రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ చేంజర్ అని, ఈ క్రమంలో ఏపీ పర్యాటకాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహకారం మెండుగా ఉందన్నారు.కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.15 నెలల కాలంలో తాము రూ.12 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు.
ఎకో, అడ్వెంచర్, బీచ్ టూరిజంలలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని, అంతేగాక వెల్ నెస్ సెంటర్స్, ఆయుర్వేద కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ అణువైన ప్రదేశం అని తెలిపారు. ఎకో టూరిజం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, టూరిజంలో ఏపీ దేశానికి మోడల్‌గా మారడంతో పాటు నంబర్ వన్ గా నిలవాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.
విభిన్న జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం భారతదేశం అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఐకమత్యమే తమ బలమని చెబుతూ భారత్ మాతాకీ జై అని నినదించారు. ఈ సందర్భంగా వికసిక్ భారత్ లక్ష్యం దిశగా తాము అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల లండన్ పర్యటన ముగియడంతో ఏపీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Arattai