NANDYAL Dec 05:- విద్యార్థి దశ నుంచే చదువుపై ఆసక్తి, క్రమశిక్షణ పెంపొందించుకుంటే తల్లిదండ్రులు, గురువులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగగలరని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం చాగలమర్రి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 (MEGA PTM) కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తోందన్నారు. ఈ సమావేశాల ద్వారా విద్యార్థుల విద్యా ప్రతిభ, క్రీడా నైపుణ్యాలు, ఉపాధ్యాయుల బోధనపై పిల్లలకు అర్థం అవుతున్న స్థాయిలను తల్లిదండ్రులకు విపులంగా వివరిస్తున్నామన్నారు.
అదేవిధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తల్లిదండ్రులకు అందించి, విద్యార్థుల పురోగతిని సమగ్రంగా అర్ధం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి ఉన్నత విద్యకు పునాది కాబట్టి రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 100 రోజుల ప్రత్యేక బోధనా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. చదువులో కొంత వెనుకబడిన విద్యార్థులను రైజింగ్ స్టార్స్ గా గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు.

అదనంగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు, క్రీడలు మరియు ఇతర నైపుణ్య కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఏ విషయంలోనైనా ముందుండాలనే తపన విద్యార్థుల్లో ఉండాలన్నారు. పోటీతత్వంతో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
డొక్కా సీతమ్మ పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, అవసరమైతే తల్లిదండ్రుల సూచనల మేరకు మెనూలో మార్పులు కూడా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులు, గురువులు క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి మాసం మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛఆంధ్ర – స్వర్ణఆంధ్ర కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను సూచించారు.
బాల్య వివాహాలపై కఠిన చర్యలు
పదవ తరగతి పరీక్షల్లో విఫలమైనా లేదా చదువు కొనసాగించడంలో ఇబ్బందులు వచ్చినా విద్యార్థినిలను బాల్య వివాహాల వైపు నెట్టకుండా, ఉన్నత విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. 18 సంవత్సరాల లోపు బాల్య వివాహాలు జరిగితే, అబ్బాయి–అమ్మాయి ఇద్దరి తల్లిదండ్రులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Arattai