తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూస్తున్న కాలంలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కీలక భూమిక పోషించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడు పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టి ఆయనను గౌరవించుకోవాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆదివారం, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జనసేన నేత, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్య వైశ్యులు జనసేన పార్టీలో చేరారు. వారిని శానస మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారితో కలసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీ నాగబాబు మాట్లాడుతూ “ఆర్యవైశ్యులు అనగానే ప్రథమంగా గుర్తుకొచ్చేది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరులో డిగ్రీ విద్యనభ్యసిస్తున్నప్పుడు కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది, ప్రతి రోజూ ఆయనకు నమస్కరించి తరగతి గదిలో అడుగుపెట్టేవాళ్ళం. హిస్టరీ విద్యార్థిగా అమరజీవి గురించి చదివి ఆయన జీవన విధానం గురించి తెలుసుకున్నాం. ఆయన జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లుపెట్టే ఆనవాయితీని తోసిపుచ్చి గోదావరి జిల్లాలకు శుద్ధి చేసిన తాగు నీరు అందించే నీటి ప్రాజెక్టుకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా చెప్పుకొనేలా చేశారు” అన్నారు.

పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలి : శ్రీ పిడుగు హరిప్రసాద్ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ… “ప్రజా సేవే పరమావధిగా బతికే అతికొద్ది మంది నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. మహోన్నత ఆశయాలు కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కోవడం నేను స్వయంగా చూశాను. కూటమి ఏర్పాటు చేసి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు.

ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సప్తాశ్వాలు, సప్తరుషులు, సప్తగిరులకు ఎంత విశిష్టత ఉందో జనసేన మూల సిద్ధాంతాలకు అంతటి విశిష్టత ఉంది. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకు వెళ్తుంది. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ మూల సూత్రాలను అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి” అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామని ప్రమాణం చేయించారు.

ఈ కార్య్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను, మాజీ శాసన సభ్యులు శ్రీ కిలారి రోశయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ శ్రీ పంచకర్ల సందీప్, శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ దేవకీ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు శ్రీ గంజి చిరంజీవి, శ్రీ కండే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Arattai