NANDYAL JAN05:- పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లాలోని 235 జిల్లా పరిషత్ పాఠశాలలకు 500 ముస్తాబు కిట్లు, గిరిజన ప్రాంతాల పాఠశాలలు మరియు వసతి గృహాలకు 121 ముస్తాబు కిట్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 500 ముస్తాబు కిట్లను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరిశుభ్రత అలవాట్లను చిన్న వయసులోనే అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ప్రతి తరగతి గదిలో “ముస్తాబు కార్నర్” ఏర్పాటు చేసి కిట్ లో వున్న అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచాలని డీఈఓను ఆదేశించారు.

విద్యార్థులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే విధంగా ఈ కిట్ల వినియోగం జరగాలని, పరిశుభ్రత పాటించే విద్యార్థులను “పరిశుభ్రత నాయకులు”గా నియమించి చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత అలవాట్లను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. అలాగే చేతులు కడుక్కునే సరైన విధానం, గోళ్లు కత్తిరించడం, జుట్టు శుభ్రత, మరుగుదొడ్డి వినియోగం వంటి అంశాలపై పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పొందడమే కాకుండా, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పరిశుభ్రతను ఎలా పాటించాలన్న విషయాలను తమ తల్లిదండ్రులకు వివరించే విధంగా అవగాహన కల్పించబడుతోందన్నారు.
అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని వసతి గృహాలకు 121 ముస్తాబు కిట్లను అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డోన్, బేతంచెర్ల మున్సిపల్ కమిషనర్ల సహకారంతో మరో 50 కిట్లను గురుకుల పాఠశాలలకు అందజేస్తున్నామన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ నుంచి 150 కిట్లు, వ్యవసాయ శాఖ నుంచి 30 కిట్లు సేకరించి బీసీ, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం “ముస్తాబు” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, నూతన సంవత్సర సందర్భంగా పూల బొకేల స్థానంలో ముస్తాబు కిట్లను అందజేయాలని జిల్లా అధికారులకు సూచించగా, ఆ మేరకు అధికారులు స్పందించి ముస్తాబు కిట్లు అందజేయడాన్ని కలెక్టర్ అభినందించారు.
Arattai