NANDYAL April 11:- జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడా ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళా మరియు శిశు అభివృద్ధి, సాధికారత శాఖలో పనిచేస్తున్న అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “పోషణ్ పక్వాడా” 8వ ఎడిషన్ కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించి, ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు పడుతున్నాయని ఆమె హెచ్చరించారు.

అధిక ఉప్పు, సోడియం కలిగిన ఆహారం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే జంక్ ఫుడ్ వల్ల ఖాళీ కేలరీలు అధికంగా శరీరంలో చేరి ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. పీచు పదార్థాల లోపం కారణంగా జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం వంటి ఇబ్బందులు వస్తాయని, సహజమైన పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకొనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదనపు చక్కెరలు, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు, ఏకాగ్రత లోపం, అతి చురుకుదనం వంటి సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.
మన సంప్రదాయ ఆహారం ఆరోగ్యానికి బలమని, స్థానిక ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పిల్లల అభివృద్ధిలో తొలి రెండేళ్లు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే 80 శాతం మెదడు అభివృద్ధి జరుగుతుందని ఆమె వివరించారు. చిన్నారులకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం, మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లను దూరంగా ఉంచడం అత్యంత అవసరమని చెప్పారు. అధిక స్క్రీన్ టైమ్ వల్ల నిద్రలేమి, కంటి సమస్యలు, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య పోషకాహారం, క్రమబద్ధమైన ఆటలు, కుటుంబంతో గడిపే సమయం కీలకమని పేర్కొన్నారు.
ఇంటి లోపల, బయట ఆటలు ఆడేలా ప్రోత్సహించడం ద్వారా శారీరక, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే పుస్తక పఠనం, కథలు చెప్పడం వంటి అలవాట్లు పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయని, భాషా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. పెద్దలతో సమయం గడపడం ద్వారా కుటుంబ బంధాలు బలపడటమే కాకుండా సంప్రదాయాలు తదుపరి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. పిల్లల శ్రేయస్సు కోసం ఇప్పటి నుంచే సరైన నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అధికారి లీలావతి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అధికారి లీలావతి, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Arattai