నంద్యాల పట్టణ విద్యా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన విద్యావేత్త, శారదా విద్యానికేతన్ వ్యవస్థాపకులు కీ.శే . ఎ. పాండురంగారావు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక విద్యా పురస్కారం”ను ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన శ్రీ శేషఫణి గారికి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పాండురంగారావు గారి విద్యాసేవలను స్మరించుకున్నారు
నంద్యాలలో శారదా విద్యానికేతన్ను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేర్చడంలో ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. విద్యను వ్యాపారంగా కాకుండా సమాజ నిర్మాణానికి సాధనంగా భావించి ఆయన సాగించిన అక్షర యజ్ఞం నేటికీ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి విద్యార్థులలో జ్ఞానంతో పాటు విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.
పాండురంగారావు గారి మరణానంతరం ఆయన ఆశయాలను సజీవంగా నిలుపుదల చేయాలనే సంకల్పంతో శారదా విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు, గతంలో ఆ విద్యాసంస్థలో పనిచేసిన ఉపాధ్యాయులు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం విశేషం.ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Arattai