NANDYAL May11:- నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం శారదా విద్యానికేతన్ పాఠశాలలో 2006–2007 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది పూర్వ విద్యార్థినీ–విద్యార్థులు, పదిమంది ఉపాధ్యాయులు హాజరై ఆనాటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల వ్యవస్థాపకులు కీ.శే శ్రీ ఏ. పాండురంగారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవిత మార్గాన్ని చూపిన గురువులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాస రెడ్డి, జనార్ధన రెడ్డి, సాంబశివారెడ్డి, రహమాన్, ఫణిభూషణ్ , చంద్రుడు లక్ష్మీనారాయణశర్మ తో పాటు మహిళా ఉపాధ్యాయులు నాగమణి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాలను అభినందిస్తూ, జీవితంలో విలువలను మరువకుండా ముందుకు సాగాలని సూచించారు.
వినోద్ రెడ్డి, బాలిరెడ్డి, వంశి, స్వరూప తదితర పూర్వ విద్యార్థుల నాయకత్వంలో నిర్వహించిన ఈ సమ్మేళనం ఆప్యాయతా వాతావరణంలో సాగింది. పాఠశాల రోజుల తీపి గుర్తులను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆటపాటలు, సరదా సంభాషణలు, జ్ఞాపకాల పంచికలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.
Arattai