NANDYAL May15 :- “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులనుఆదేశించారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రజల నుండి నేరుగా వినతులు, ఫిర్యాదులు, సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి దూర ప్రాంతాల ప్రజలు రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిరంతరాయంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వాటి స్వభావాన్ని బట్టి ఒక రోజు నుండి గరిష్టంగా 21 రోజుల లోపు పరిష్కరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, అందులో భాగంగా మొదటిసారిగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. ఒక్కరోజే సుమారు 458 అర్జీలు అందాయని, వాటన్నింటినీ స్కాన్ చేసి సంబంధిత అధికారుల లాగిన్లకు పంపిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్లో దాదాపు 60 శాతం భూ వివాదాలకు సంబంధించినవేనని, 25 శాతం అభివృద్ధి పనులు, రహదారులు, కల్వర్టులు, పాఠశాలల స్థల సమతలీకరణ, శ్మశాన వాటికలు వంటి అంశాలపై ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 10 నుంచి 15 శాతం వరకు వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, సదరం స్లాట్లకు సంబంధించిన సమస్యలేనని పేర్కొన్నారు. అలాగే మొదటి, రెండో శుక్రవారాల్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, మూడో శుక్రవారం నాటికి వాటి పరిష్కారానికి చర్యలు పూర్తి చేయాలని, నాలుగో శుక్రవారం నిర్వహించే సమీక్షలో ఎన్ని కేసులు పరిష్కరించామో, ఎన్ని పట్టాలు పంపిణీ చేశామో సమగ్రంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.

క్షేత్రస్థాయిలో అధికారులు సమర్థవంతంగా స్పందించకపోవడం వల్లే ప్రజలు జిల్లా కలెక్టర్ దాకా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, గ్రామ మరియు మండల స్థాయి అధికారులు తమ పనితీరును మెరుగు పరచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం అందించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే శుక్రవారం ఉదయం 9 గంటలకే అధికారులు హాజరై, కనీసం 450 అర్జీల పరిష్కారంతో బాధితులకు పత్రాలు అందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, గతంలో చిన్న చిన్న పనుల కోసం ప్రజలు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తుండటం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా స్వేచ్ఛగా పని చేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇంకా అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని, ప్రజలు అభివృద్ధి పనులు కోరుతూ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఫిర్యాదులు లేని ఆళ్లగడ్డ, సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే తమ లక్ష్యమని ఆకాంక్షించారు.
మండలాల వారీగా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఎక్కువ ఫిర్యాదులను పరిష్కరించిన మండల అధికారులను ప్రోత్సాహకంగా సన్మానిస్తామని తెలిపారు. దీన్ని పోటీగా భావించి అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే అఖిలప్రియ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వినేందుకు వరుసగా నాలుగు శుక్రవారాలు జిల్లా యంత్రాంగం మొత్తం ఆళ్లగడ్డకు రావడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేక పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన సమస్యలు
1) చాగలమర్రి మండలం ముత్యాలతండాకు చెందిన బుక్కే వీరమ్మ భాయ్ తనకు సొంత భూమి లేదని, సర్వే నెం.959లో అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. సదరు భూమికి డి-పట్టా మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు.
2) రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక (మెయిన్) పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, పాఠశాలలో ఉన్న మూడు పాత తరగతి గదులు శిథిలావస్థకు చేరుకొని కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఉపాధ్యాయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తరగతి గదులను పునర్నిర్మించడంతో పాటు, పాఠశాల రహదారికి సమీపంలో ఉండటంతో విద్యార్థుల భద్రత కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
3) ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామానికి చెందిన వెంకట సుబ్బమ్మ తన భర్త మరణించి రెండేళ్లు అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ మంజూరు కాలేదని పేర్కొన్నారు. తనకు విధవ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు.
4) ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సర్వే నెం.380లోని రెండు ఎకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు, సర్వే నెం.349కు సంబంధించిన రీసర్వేలో 0.16 సెంట్లకు బదులుగా 1.71 సెంట్లు నమోదయ్యాయని తెలిపారు. సంబంధిత భూ విస్తీర్ణ వివరాలను సరిచేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
Arattai