NANDYAL May14 :– ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాల బాలుర హాస్టల్ -1 మరియు 2లకు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన పారిశుద్ధ్య వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కొలిమిగుండ్ల యూనిట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా రూ.14.53 లక్షల వ్యయంతో ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ నిర్మాణం ద్వారా హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన మరియు నాణ్యమైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

రామ్‌కో సిమెంట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రామ్‌కో సిమెంట్స్ కొలిమిగుండ్ల యూనిట్ హెడ్ మీనాక్షి సుందరం, ప్రెసిడెంట్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్. రామరాజ్, జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఏజీఎం శోభన్ కుమార్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్ శ్రీనాగరాజు, జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి చింతామణి, కళాశాల వసతిగృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు రామ్‌కో సిమెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Arattai