NANDYAL May19 :- భారత మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 114వ జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి మరియు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల పట్టణంలోని భారతి సీడ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన జీవిత విశేషాలు, రాజకీయ నిరాడంబరత, ప్రజాసేవా దృక్పథం, నంద్యాల ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించిన సంజీవరెడ్డి విద్యుత్తు వ్యవసాయ రంగాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని పేర్కొన్నారు. ప్రధాన వక్త రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ,“రాజకీయ పదవులు వ్యక్తిని గొప్పవాడిని చేయవని ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడినే మహానుభావుడిగా నిలబెడుతుందన్నారు. సంజీవరెడ్డి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

ముఖ్యఅతిథి డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ,“రాష్ట్రపతి భవన్ వరకు ఎదిగినా గ్రామీణ భారతాన్ని మరువని నాయకుడుగా సంజీవరెడ్డి చరిత్రలో నిలిచారని నంద్యాల ప్రాంత వ్యవసాయాభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణపై ఆయన చూపిన దూరదృష్టి చిరస్మరణీయం” అన్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ మాట్లాడుతూ,“ప్రజా జీవనంలో వినయం ఎంత గొప్పదో నీలం గారి వ్యక్తిత్వం చెబుతుంది. నేటి రాజకీయ నాయకత్వం ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి” అన్నారు. మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా లోక్ సభ స్పీకర్ గా రాష్ట్రపతిగా అనేక కీలకపదవులు సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. పార్లమెంటు సభ్యునిగా నంద్యాలతో ఆయనకు ఉన్న అనుబంధం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం” అన్నారు.

మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి మాట్లాడుతూ,“సేవా ధర్మం, సరళ జీవనం, ఉన్నత ఆలోచనలు కలగలిపిన రాజకీయవేత్తగా నీలం సంజీవరెడ్డి తరతరాలకు ఆదర్శం” అని తెలిపారు. ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ, “రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్న ఈ సమయంలో నీలం సంజీవరెడ్డి జీవితం యువతకు దిక్సూచి వంటిది” అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణి మాట్లాడుతూ,“విద్య, విలువలు, వినయం — ఈ మూడు కలిసి నాయకత్వాన్ని నిర్మిస్తాయని నీలం గారి జీవితం తెలియజేస్తుంది” అన్నారు. సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,“రైతు సంక్షేమం పట్ల నీలం గారికి ఉన్న చిత్తశుద్ధి నేటికీ స్ఫూర్తిదాయకం” అన్నారు. మధుసూదన రెడ్డి మాట్లాడుతూ,“నంద్యాల ప్రాంత ప్రజల అభ్యున్నతికి ఆయన చూపిన ప్రత్యేక శ్రద్ధ చరిత్రలో నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవులు నీలకంఠమాచారి, మహమ్మద్ రఫీ, నరేంద్ర తదితరులు నీలం సంజీవరెడ్డి జీవితం, నిరాడంబర రాజకీయాలపై కమ్మటి కవితలు వినిపించి సభికులను ఆకట్టుకున్నారు. అతిథులు గునిశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డిని సమాఖ్య సభ్యులు ఘనంగా సత్కరించారు.
Arattai