NANDYAL June02:- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లను రాబోయే రెండేళ్లలో “నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్‌లు (NZHC)”గా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతా భావం పెంపొందించడం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. మంగళవారం జిల్లా హెచ్ఆర్డీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు పర్యావరణ పరిరక్షణ, హరితావరణ విస్తరణ, సూక్ష్మ వాతావరణ మెరుగుదల, కార్బన్ తగ్గింపు లక్ష్యాలతో అల్ట్రా హై డెన్సిటీ (యూహెచ్డీ) ప్లాంటేషన్ – అనంత అరణ్య మోడల్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) మరియు వీబీ-గ్రామ్ జి ద్వారా జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ వివరించారు. మొక్కలు నాటడం అంటే కేవలం హరిత కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనం పెరగడం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడి ప్రజారోగ్యానికి మేలు జరగడమే కాకుండా, ఉత్పాదకత పెరిగి ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.

మొక్కల పెంపకం వల్ల నేల సారవంతం పెరగడం, భూగర్భ జలాల నిల్వలు మెరుగుపడడం, పర్యావరణ సమతుల్యత నెలకొనడం, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అనుబంధం పెరగడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. “వేస్ట్ టు వెల్త్” భావనను ప్రతి విద్యాసంస్థలో ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే విధానాలపై అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ సృష్టిలో ఏదీ వ్యర్థం కాదని, ప్రతి వనరును పునర్వినియోగం చేస్తూ గరిష్ట ప్రయోజనం పొందడమే సుస్థిర అభివృద్ధి లక్ష్యమని వివరించారు.
జిల్లాలో మట్టి సారవంతం పెంపు కోసం బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలు, కొబ్బరి బోండాలు వంటి పదార్థాలతో తయారుచేసే బయోచార్ నేలలో కార్బన్ శాతాన్ని, గుల్లదనాన్ని పెంచి దిగుబడులు మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు అధిక ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటలు, ఆధునిక సాంకేతిక వ్యవసాయ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఖర్జూరం, మెకాడమియా నట్స్, చామంతి వంటి అధిక విలువ కలిగిన పంటల సాగుతో రైతులు విశేష లాభాలు పొందుతున్నారని తెలిపారు.
జిల్లా స్థూల ఆర్థికోత్పత్తి (జీడీపీ) పెరుగుదలలో హార్టికల్చర్, పశుసంవర్ధక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న నంద్యాల జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా మరింత ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక వ్యవసాయం, సహజ వనరుల సమర్థ వినియోగం ద్వారా జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Arattai