NANDYAL June 04:- పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల అమలులో విశిష్ట ప్రతిభ కనబరిచిన శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాల ప్రతిష్టాత్మకమైన “ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ అవార్డు”ను అందుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.

భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా కళాశాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుండి 29 వరకు ఎర్త్ వీక్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటడం, సస్టైనబిలిటీ ప్రతిజ్ఞ చేయించడం, కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చిన్నారుల పార్కు శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం వంటి పలు పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు, ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు సమర్పించారు.

దేశవ్యాప్తంగా 534 విద్యాసంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాల 19వ స్థానాన్ని సాధించడం విశేషం. ఈ విజయానికి గుర్తింపుగా జూన్ 1న హైదరాబాద్లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రిసెర్చ్ హైట్స్ సంస్థ ప్రతినిధులు కళాశాలకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ అవార్డును ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమాల నిర్వహణకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బి.వి. సుబ్బయ్య అందించిన ప్రోత్సాహం, సహకారం ఎంతో దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఎం. శ్రావణి కుమారి, టి. మాధవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య, అధ్యాపకులు, విద్యార్థులు అవార్డు గ్రహీతలను అభినందించారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai