NANDYAL June11:-అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న యోగా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, యోగా అసోసియేషన్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై యోగా ప్రచార కార్యక్రమాలు, ప్రజల్లో యోగాపై అవగాహన పెంపు చర్యలు, నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7 నుండి 21 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొని విశేష స్పందన చూపారని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక థీమ్‌లను కేటాయించగా, నంద్యాల జిల్లాకు యోగా అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈనెల 17వ తేదీ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించియున్నారని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగా ప్రాముఖ్యతను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు మహానంది దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సుమారు 1,500 మంది పాల్గొనే యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అలాగే జూన్ 17న నంద్యాల పట్టణంలో సుమారు 5,000 మంది పాల్గొనే భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. యోగా కార్యక్రమాల నిర్వహణకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న ప్రాంగణాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పాల్గొనే వారికి అనుకూలంగా డయాస్ ఏర్పాటు, గ్రీన్ కార్పెట్, తాగునీటి సదుపాయం, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. చిన్న రాళ్లు, వ్యర్థాలను తొలగించి గ్రీన్ మ్యాట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డిఎస్డిఓను కలెక్టర్ ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, శానిటేషన్ లేదా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు హౌస్‌కీపింగ్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘పురమిత్ర’ మొబైల్ యాప్‌లను వినియోగించాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, పన్నులు, పౌర సేవలు తదితర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ యాప్‌ల ద్వారా నమోదు చేస్తే 24 గంటల్లోపు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘పురమిత్ర’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు. అదేవిధంగా, పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రజా ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్లాస్టిక్ రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఆయుష్ కోఆర్డినేటర్ డా. యశోధర, డిఎస్డిఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
Arattai