NANDYAL June22 :- గత రెండేళ్ల కాలంలో జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన ఉత్తమ విధానాలు, వినూత్న కార్యక్రమాలు, ప్రజలకు అందించిన మెరుగైన సేవలను సమగ్రంగా ప్రతిబింబించేలా ఉత్తమ కధనాలతో ప్రత్యేక బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి శాఖ తమ పరిధిలో అమలు చేసిన ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీలను సంక్షిప్తంగా, ప్రభావవంతంగా రూపొందించాలని తెలిపారు. ఒక్కో అంశం ఒకటి లేదా రెండు పేజీలకు మించకుండా ఉండాలని, అందులో జిల్లా పరిస్థితి, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరించిన వ్యూహాలు, అమలు విధానం, సాధించిన ఫలితాలు స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. ప్రతి కథనానికి ఆకర్షణీయమైన శీర్షికతో పాటు నాణ్యమైన హెచ్డీ ఫోటోలను జతచేయాలని కలెక్టర్ తెలిపారు. బుక్లెట్ తయారీ బాధ్యతలను పీడీ డీఆర్డీఏ, పీడీ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయం, ఉద్యానవనం, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్థక, మత్స్యశాఖలకు సంబంధించిన ఉత్తమ విధానాలను సమన్వయం చేయాలని, మహిళా నర్సరీలు, కొత్త పంటల ప్రవేశపెట్టడం వంటి విజయగాథలను పొందుపరచాలని సూచించారు.

భూగర్భజల శాఖ చేపట్టిన డిఫంక్ట్ బోర్వెల్ రీఛార్జ్ కార్యక్రమంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉత్తమ విధానాలను సేకరించాలని, అలాగే పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, హౌసింగ్ తదితర ఇంజినీరింగ్ శాఖలు తమ వినూత్న కార్యక్రమాల కథనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్, రిజిస్ట్రేషన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ వంటి ఆదాయ వనరుల శాఖల వివరాలను జిల్లా రిజిస్ట్రార్ సమన్వయం చేయాలని, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఏపీఐఐసీకి సంబంధించిన వివరాలను కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సేకరించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో అమలవుతున్న స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ ఆధారిత ఉత్తమ విధానాలను మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేయాలని, పోలీసు శాఖ అమలు చేసిన వినూత్న కార్యక్రమాలను కూడా బుక్‌లెట్‌లో పొందుపరచాలని తెలిపారు. పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ, దేవాదాయ శాఖలకు సంబంధించిన విశిష్ట కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టరేట్ తరఫున జిల్లా హెచ్ఆర్డీ, పీజీఆర్ఎస్, ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు సంబంధించిన మూడు ప్రధాన ఉత్తమ కధనాలను ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం, సిఎస్ఆర్ నిధులతో స్టార్టప్‌ల కోసం అభివృద్ధి చేస్తున్న ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి అంశాలను ఇందులో పొందుపరుస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో అమలైన ఉత్తమ విధానాలు రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా నాణ్యమైన డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Arattai