NANDYAL July25 :- పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించి పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్వయంగా ఫోన్లో మాట్లాడారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కార ప్రక్రియపై కలెక్టర్ ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించి పరిష్కరించిన అర్జీలకు సంబంధించి…. వారి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యాయా, అందించిన సేవలపై వారు సంతృప్తిగా ఉన్నారా అనే విషయాలను ఫోన్ ద్వారా నేరుగా అడిగి తెలుసుకుంటూ, పరిష్కారాల నాణ్యతను సమీక్షించారు.

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద ఆర్థిక సహాయం తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించిన తలారి రామయ్య, శ్రీమతి షేక్ మసుంబితో జిల్లా కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అధికారుల చర్యల ఫలితంగా అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు వారు జిల్లా కలెక్టర్కు తెలియజేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పలు అర్జీలపై కూడా సంబంధిత అర్జీదారులతో జిల్లా కలెక్టర్ ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కార స్థితిని తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య పరిష్కారమైన వెంటనే సంబంధిత అర్జీదారులకు స్వయంగా సమాచారం అందించి, వారి సంతృప్తిని నిర్ధారించడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించేందుకు అధికారులు కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Arattai