NANDYAL July27 :- ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు తగిన తాగునీటి వసతులు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యతతో అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అర్జీల స్వీకరణ అనంతరం వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేని నేపథ్యంలో ప్రత్యేక అధికారులే పూర్తి బాధ్యతతో వ్యవహరించి గ్రామాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా తాగునీటి సదుపాయాల కల్పనకే వినియోగించాలని, బోర్వెల్ల ఏర్పాటు, పైప్లైన్ మరమ్మతులు, ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధి వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నీటి సమస్య కొనసాగుతున్న సమయంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల వంటి ఇతర అభివృద్ధి పనులకు నిధులు వినియోగించరాదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఉన్న నీటి వనరులు మరో 10, 15 లేదా 30 రోజులకు సరిపోతాయా అనే అంశంపై అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించారు. నీటి లభ్యతపై ముందస్తు ప్రణాళిక రూపొందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

తాగునీటి సమస్య ఉన్న 42 గ్రామాలకు సంబంధించి ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ శాఖల ద్వారా చేపట్టే పనులను పరిశీలించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భంలో వెంటనే అమలు చేయడానికి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక (బి-ప్లాన్) సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి అధికారి తమ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది iGOT ఆన్లైన్ శిక్షణా కోర్సులను సకాలంలో పూర్తిచేస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణా కోర్సుల ద్వారా అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందడంతో పాటు, ప్రభుత్వ సేవల అమలు మరింత సమర్థవంతంగా సాగి జిల్లా పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల (KPIs)కు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రజలకు చేరవేసి, వాటి వినియోగాన్ని పెంపొందించేలా సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలబెట్టేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు.”
Arattai