లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం
NANDYAL Aug13:- ఆగస్టు 13 ప్రపంచ అవయవ దాన దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 జై గవర్నర్ విరూపాక్ష రెడ్డి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ,శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి పాల్గొని విద్యార్థులకు అవయవ దాన ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అవయవ దానం పై ప్రజా అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు.

విరూపాక్ష రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా దేశంలో అవయవ దానం లభించక ఐదు లక్షల మంది మరణిస్తున్నారని,లక్షన్నర మంది మూత్రపిండ అవయవం అవసరం ఉన్నవారు, ప్రతి ఏటా పది లక్షల మంది నేత్రాలలో కార్నియా మార్పు ద్వారా కంటి చూపు కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారని తెలిపారు.

బ్రెయిన్ డెత్ అయిన వారి బంధువులకు అవయవదానంపై అవగాహన కలిగితే వీరందరికీ పునర్జన్మను అందించే అవకాశం దొరుకుతుందని, అవయవదానంపై ప్రజలలో అవగాహన పెంచడం కోసం మేధావులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ రవి కృష్ణ ప్రసంగిస్తూ మనిషి సాధారణంగా మరణించిన ఆరు గంటల లోపు రెండు నేత్రాలను దానం చేయవచ్చని, బ్రతికి ఉన్న సమయంలో తమకున్న రెండు మూత్రపిండాలలో ఒక దానిని, అదేవిధంగా కొంత భాగం కాలేయాన్ని దానం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.వివిధ కారణాల రీత్యా బ్రెయిన్ డెత్ అన్న స్థితికి చేరుకున్న మనుషుల నుండి బంధువుల అనుమతితో గుండె,రెండు మూత్రపిండాలు రెండు ఊపిరితిత్తులు, కాలేయం,రెండు నేత్రాలు అవసరం ఉన్న 8 మందికి అమర్చి వారికి పునర్జన్మను ప్రసాదించే అవకాశం ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా గురు రాజా పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు అవయవదాన దినోత్సవం ప్రాధాన్యతపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ సంయుక్త కార్యదర్శి అమిదేల జనార్ధన్ సౌజన్యంతో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి తోపాటు లయన్స్ క్లబ్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ మహబూబ్ బాషా,జోనల్ చైర్మన్ సోమేసుల నాగరాజు, కార్యదర్శి మేడా చంద్రశేఖర్,సభ్యులు మామిళ్ళ నాగరాజు, రత్నకుమార్, జగన్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai