మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NANDYAL Aug15 :- నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూనెపల్లె లో ఉన్న సంఘం కార్యాలయం వద్ద 80వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి గురవయ్య, కోశాధికారి జయరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లయన్స్ అంతర్జాతీయ సంస్థ గవర్నర్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాజీ సైనికులతో కలిసి పతాక వందనం చేశారు.

ఈ సందర్భంగా సంఘం కార్యాలయ సమావేశ భవనంలో అధ్యక్షులు రంగనాయకులు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వలన సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ,దేశ ప్రజలు సురక్షితంగా ఉండటానికి విధి నిర్వహణలో ఉన్న సైనికులు,మాజీ సైనికుల త్యాగాలు మరువలేనివి అన్నారు.

దేశానికి వారు చేసిన సేవలు దేశ ప్రజలు రుణం తీర్చుకోలేనివి అన్నారు.కుటుంబాలను వదిలి సరిహద్దులలో దేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులను ప్రజలు గుర్తుంచుకుని వారి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. వారికోసం అన్ని స్పెషాలిటీ వైద్యులతో ఐఎంఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి గురవయ్య, కోశాధికారి జయరావు, అధిక సంఖ్యలో మాజీ సైనికులు పాల్గొన్నారు.
Arattai