ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నంద్యాల జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు
NANDYAL Sep11:- ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందిస్తూ, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్న నంద్యాల జిల్లా యంత్రాంగం పనితీరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యతనిస్తూ, వినూత్న విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిని ముఖ్యమంత్రి అభినందించారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను కలెక్టర్ ముఖ్యమంత్రికి నివేదించారు.

వాగులు, వంకల వద్ద 14 అదనపు కల్వర్టులు/వంతెనలకు మంజూరు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామ ప్రజలు వాగు దాటి స్మశాన వాటికకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి కల్వర్టు నిర్మాణానికి మంజూరు చేసి పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇదే విధంగా జిల్లాలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాగులు, వంకలను గుర్తించి అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 14 కల్వర్టులు/వంతెనల నిర్మాణానికి మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. మంజూరైన పనుల్లో దాదాపు అన్ని పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని కలెక్టర్ సీఎంకు నివేదించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం పరిష్కరించడమే కాకుండా, సమస్యకు మూలకారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు.
సుదూర ప్రాంతాల ప్రజలకు ఉచిత భోజన సదుపాయం
శ్రీశైలం, పాణ్యం, ఆత్మకూరు, నంద్యాల తదితర సుదూర ప్రాంతాల నుంచి సుమారు 400 మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతున్న నేపథ్యంలో, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజలకు భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. డిస్పోజబుల్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను వినియోగిస్తూ ప్లాస్టిక్ రహిత విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సౌకర్యవంతంగా కూర్చుని భోజనం చేసేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల స్పందన, గ్రీవెన్స్ నిర్వహణ విధానం, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న జిల్లా యంత్రాంగం పనితీరును ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.
Arattai