సెప్టెంబర్ 23న ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
NANDYAL Sep21 :- ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) హాల్ నందు ఉచిత ప్రత్యేక ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తెలిపారు. సెప్టెంబర్ 23 వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరాన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయుర్వేద నిపుణులైన వైద్యులు వివిధ ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేయనున్నారని తెలిపారు.
ఈ సదస్సు ద్వారా
1.నాడీ పరీక్ష నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం.
2.బి.ఎం.డి. (Bone Mineral Density) పరీక్ష ద్వారా ఎముకల సాంద్రతను పరీక్షించడం. ముఖ్యంగా 40–50 సంవత్సరాలు పైబడిన వారు ఈ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
3.హెచ్బి. (HB),
4.ఆర్బిఎస్ (RBS) పరీక్షలు
5.ఆరోగ్యకరమైన దినచర్య, సరైన నిద్ర, ఆహార నియమాలు, జీవనశైలిపై నిపుణుల సూచనలు అందించడం.
6.పథ్య–అపథ్య విధానాలపై అవగాహన కల్పించి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారానికి దూరంగా ఉండాలనే విషయాలపై సూచనలు ఇవ్వడం.
7.వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడే లైవ్ యోగా థెరపీ ప్రదర్శన, శిక్షణ.
8.పంచకర్మ చికిత్సా విధానాలపై ప్రత్యక్ష ప్రదర్శన (Live Demonstration) నిర్వహించడం.
వెన్నునొప్పి, మెడనొప్పి, స్పాండిలైటిస్, ఎక్కువసేపు తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల కలిగే సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణుల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. జిల్లా అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావాలి అన్నారు.జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తమ పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులతో కలిసి సెప్టెంబర్ 23 తేదీన ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వైద్య నిపుణుల సలహాలు, అవసరమైన ఉచిత మందులు, ఆహార నియమాలకు సంబంధించిన డైట్ చార్ట్ పొందడంతో పాటు యోగా థెరపీ, పంచకర్మ విధానాలపై అవగాహన పొందాలని అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా అధికారులు అందరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Arattai