NANDYAL April 26:-నంద్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన రైతు యేలంపల్లి చంద్రశేఖర్ రెడ్డి వృద్ధ మహిళలను సత్కరించి ఆదర్శంగా నిలిచారు. ఆదివారం తమ కుటుంబం తరపున గ్రామంలోని సుంకులాపరమేశ్వరీ అమ్మవారికి భక్తి ప్రపత్తులతో నిర్వహించిన ఉత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బంధువులు, అతిథులు గ్రామ పెద్దల సమక్షంలో తమ వంశంలో 93 సంవత్సరాలకు పైగా వయసు కలిగి ఆరోగ్యంగా ఉన్న వృద్ధ మహిళలను చంద్రశేఖర్ రెడ్డి ,లక్ష్మీదేవి దంపతులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన వెంకటమ్మకు 98 సంవత్సరాలు ఉంటాయని అంకాలమ్మ, సుబ్బమ్మ లకు 93 సంవత్సరాల వయసు ఉందని, వీరంతా కాయకష్టంతో తమ కుటుంబాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. వీరిలో వెంకటమ్మ 98 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా హుషారుగా ఉందన్నారు. సుబ్బమ్మ పుట్టుకతో మూగ అయినప్పటికీ కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహించిందని కొనియాడారు.

చిరుధాన్యాలతో కూడిన అప్పటి ఆహారపు అలవాట్లు వారిని ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంచాయన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యావంతులై వ్యవసాయరంగాన్ని ఎంచుకొని రాణిస్తున్న యువరైతులు దివాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నాగార్జున రెడ్డి లను సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు రామ చంద్రారెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు రామ సుబ్బారెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, జయరామి రెడ్డి, రఫీ, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి శివనాగిరెడ్డి, చిరుధాన్యాలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న రైతు రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Arattai