NANDYAL May21:- నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. గురువారం నంద్యాలలో బొగ్గులైన్ బాధితుల కొరకు స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి ఫరూక్ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పలు అనువైన స్థలాలను నేరుగా పరిశీలించి, బాధితులకు అన్ని వసతులతో కూడిన మెరుగైన స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

కూటమి ప్రభుత్వంలో పేదలకు 2 సెంట్ల స్థలం.. మంత్రి ఫరూక్
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేద ప్రజలకు కేవలం ఒకే ఒక్క సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని జీవించడం పేదలకు ఎంతో ఇబ్బందికరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే బాధితులకు ఇప్పుడు రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.

“పేదలు ఆత్మగౌరవంతో, సౌకర్యవంతంగా జీవించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అందుకే గత పాలకుల వలే కాకుండా, రెండింతల స్థలాన్ని (2 సెంట్లు) బాధితులకు అందిస్తున్నాం అని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగతిన స్థల సేకరణ పూర్తి చేసి, పంపిణీ ప్రక్రియను చేపడతామని మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిప్యూటీ తాసిల్దార్ సంజీవ, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, స్థానిక అధికారులు, కూటమి నాయకులు మరియు ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. రాజేంద్రకుమార్, నంది న్యూస్ రిపోర్టర్
Arattai