NANDYAL May21:- అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో గురువారం ఉదయం ప్రత్యేకంగా “చాయ్ విత్ టీచర్స్” కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్నింగ్ వాక్ అనంతరం నంద్యాల ఉపవిద్యాధికారి డి.టి. శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నేషనల్ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్ వద్ద అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి చాయ్ సేవిస్తూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డోన్ ఉపవిద్యాధికారి వెంకట రామిరెడ్డి, మహానంది ఎంఈఓ రామసుబ్బయ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపవిద్యాధికారి డి.టి. శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, మితంగా టీ సేవించడం శరీరానికి ఉల్లాసాన్ని, మనసుకు ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. అలసటను తగ్గించి చురుకుదనాన్ని పెంచడంలో టీ ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
అలాగే విద్యాభివృద్ధి దిశగా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి బాలబాలికను పాఠశాలకు తీసుకురావడం ద్వారా విద్యా వికాసానికి బాటలు వేయవచ్చని అన్నారు.“ఒక కప్పు టీ కేవలం పానీయం మాత్రమే కాదు…మనుషులను దగ్గర చేసే మాధ్యమం,మనసులను కలిపే ఆత్మీయతకు ప్రతీక” అని పేర్కొంటూ ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు.ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగి, ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది
Arattai