NANDYAL June26 :- సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “సాహిత్య సమ్మేళనం–2026” కరపత్రాన్ని శుక్రవారం నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు యం. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, జూలై 11, 12 తేదీలలో విజయవాడలో జరిగే సాహిత్య సమ్మేళనం తెలుగు భాషా–సాహిత్యాభివృద్ధికి ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని అన్నారు. కవిత్వం మనిషి అనుభూతులకు అక్షరరూపమని, సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి తెలుగు సాహిత్యానికి ఉందని పేర్కొన్నారు. సాహితీ స్రవంతి కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు సాహిత్య సమ్మేళనం-2026 గురించి వివరిస్తూ , “సాహితీ స్రవంతి” మరియు “మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం” సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సాహిత్య సమ్మేళనంలో కవిత్వ నిర్మాణం, వర్తమాన సాహిత్యం, సాహిత్య చరిత్ర – వివిధ దృక్పథాలు, తెలుగు కథ – సామాజిక చింతన, కథా రచన – మెలుకువలు వంటి అంశాలపై ప్రముఖ సాహితీవేత్తలతో కార్యశాల నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కరపత్ర ఆవిష్కరణ అనంతరం “తెలుగు కవిత్వం – ఆధునిక ధోరణులు” అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టికి ముఖ్యఅతిథిగా హాజరైన విశ్రాంత శాస్త్రవేత్త డా. రవీంద్రనాథ్ మాట్లాడుతూ, “కాలం మారుతున్న కొద్దీ కవిత్వ రూపాలు మారవచ్చు; కానీ మానవీయ విలువలను మేల్కొలిపే హృదయస్పందనే నిజమైన కవిత్వం అని తెలిపారు. తెలుగు పండితులు అన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవిత్వం సమాజంలోని మార్పులను మాత్రమే కాక, మనిషి అంతరంగాన్ని కూడా సున్నితంగా ఆవిష్కరిస్తూ కొత్త ఆలోచనలకు దారితీస్తోందన్నారు. అవధాని డాక్టర్ గంగుల నాగరాజు మాట్లాడుతూ సంప్రదాయ సౌందర్యాన్ని కాపాడుకుంటూనే నవ్య భావవ్యక్తీకరణకు వేదికగా తెలుగు కవిత్వం మరింత వికసించేలా కవులు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత డా.కిశోర్ కుమార్ , ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, ఎద్దు ప్రసాద్, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ, వివిధ సంఘాల ప్రతినిధులు మణిశేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Arattai