NANDYAL July03:- అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శుక్రవారం మహానంది మండలంలోని కమ్మ సత్రం నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లతో కలిసి “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలతో పాటు, ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ వరుసగా నాలుగు వారాల పాటు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఏ ఒక్కరు కూడా సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అధికారులు ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.తీసుకుంటున్న చర్యలను నేరుగా ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. అర్జీలు సమర్పించిన వారికి తప్పకుండా రసీదులు ఇవ్వాలన్నారు. ఇళ్లు, స్థలాలు, పెన్షన్లు, రెవెన్యూ అంశాలు, భూమి వివాదాలు సహా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, అవసరమైన చోట వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కార పురోగతిపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన గ్రీవెన్స్ వ్యవస్థను ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలిగిందన్నారు. నెలలో వచ్చే నాలుగు వారాల్లో ఒక్కో మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ సమస్యలను అధికారులకు వివరించి, ఈ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Arattai