GUDIVADA July18:- స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్ జీవన విధానం అవలంబించాలని, ఇంటిపై పడే వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన 18వ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీరింగ్ పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ప్రజా వేదిక సమీపంలో ఆన్లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను తిలకించారు. నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురంలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించారు. ఉయ్యూరు, కుప్పం, నిడుదవోలు, బాపిరాజు, మదనపల్లి, విజయనగరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ, నెల్లూరు కార్పొరేషన్లకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డులు అందించిన సీఎం…ఆపరేషన్ క్లీన్ స్వీప్‌పై కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.

స్వచ్ఛ రాజకీయ లక్ష్యంతో ఎన్టీఆర్ పార్టీ స్థాపన
రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని, ఈసారి 18వ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గుడివాడ దివంగత ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతమని గుర్తు చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే లక్ష్యాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు. గతంలో స్వార్థ రాజకీయాలే ఉన్న పరిస్థితిని మార్చి అభివృద్ధి, సంక్షేమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టే లక్ష్యంగా పాలన అందిస్తోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా శాంతిభద్రతలు, సంక్షేమం, ఆదాయ వృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

పరిశుభ్రమంటే ప్రజారోగ్యం మెరుగుపడటం
‘పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు ఊడ్చడం మాత్రమే కాదని, పర్యావరణం, ప్రజారోగ్యం మెరుగు పడటమే అసలు లక్ష్యం. గత పాలనలో చెత్తతో నిండిపోయిన ప్రాంతాలను ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ఒక్కరూ తమ జన్మస్థలాన్ని చెత్త రహితంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిస్తున్నా. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛత లక్ష్యం సాధ్యం. పచ్చదనం, పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర నిర్మాణం పూర్తి అవుతంది.

తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత తాను తీసుకున్నానని, పూర్తి పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోం. ప్రజా రాజధాని అమరావతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. గతంలో జన్మభూమి కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు స్పందించిన స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి ద్వారా సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం అన్నారు.

అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దతాం
ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించామని, త్వరలో మరో 1104 ఇ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.528 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 8 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంట్లో వ్యర్థాల వర్గీకరణ ప్రారంభించాలని ప్రజలను కోరిన సీఎం, స్వచ్ఛ రథం ద్వారా వ్యర్థాల సేకరణ చేస్తూ రూ.16 కోట్ల విలువైన నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు.

గత పాలకులు రోడ్లపై పేరుకుపోయేలా వదిలేసిన చెత్త కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయని, వారు వదిలేసిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ పథం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ వంటి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.

ఈ నెల 22 నుంచి తల్లికి వందనం
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 తేదీల మధ్య “తల్లికి వందనం” పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా పేదల పక్షాన నిలిచే మనసుంది అని ఆయన అన్నారు. ఆంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పనిచేసే వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద 67,47,197 మంది విద్యార్థులకు సంబంధించి రూ.10,122 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

Arattai