నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన ఆరవ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్
NANDYAL Sep12 :- ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నంద్యాల చెస్ సంఘం నిర్వహణలో శనివారం స్థానిక టేక్కే ప్రాంతంలో ఉన్న నెరవాటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఆరవ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో తరచూ చెస్ టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని, నంద్యాలలో ప్రతి ఏటా రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు నిర్వహించడం నంద్యాలకు గర్వ కారణం అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు మొబైల్ స్క్రీన్ టైం తగ్గించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడకుండా, వారి మెదళ్లకు పదును పెడుతూ వారి లోని సృజనాత్మక శక్తులను ప్రోత్సహించాలన్నారు. బాలల మేధాశక్తిని చెస్ క్రీడ పెంపొందింప చేస్తుందని అన్నారు.

నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల డైరెక్టర్ నెరవాటి ఆనంద్ గుప్తా కరస్పాండెంట్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్ మాట్లాడుతూ చదరంగం క్రీడ విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుముడింప చేస్తుందని , చెస్ క్రీడల నిర్వహణకు తమ పాఠశాల ఎప్పుడు సహకారం అందజేస్తుందని అన్నారు.

నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, లయన్స్ జిల్లా పిఆర్ఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ యువజన బ్యాచ్ తరపున ఈ టోర్నమెంట్ లో బహుమతుల కోసం పదివేల రూపాయలు విరాళం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా చెస్ టోర్నమెంట్ల నిర్వహణకు లయన్స్ క్లబ్ సహకారాన్ని కొనసాగిస్తామన్నారు.

నంద్యాల జిల్లా సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 జిల్లాల నుండి 250 మంది చదరంగం క్రీడాకారులు ఈ ఆరవ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని, 6,8,10,12,14,16 లోపు వయసు ఆరు విభాగాలలో ఓపెన్ మరియు బాలికల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు జాతీయస్థాయిలో జరిగే చెస్ పోటీలలో రాష్ట్ర జట్టు లో పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున రావు,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ నెరవాటి ఆనంద్ గుప్తా, కరస్పాండెంట్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్, లయన్స్ క్లబ్ నంద్యాల అధ్యక్షులు సందీప్, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, జిల్లా పి ఆర్ ఓ సుధాకర్ రెడ్డి, చెస్ నంద్యాల సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి,కోశాధికారి శ్రీనిష్, టోర్నమెంట్ ఆర్బిటర్లు కిరణ్, స్పందన,నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు వాసు,జగన్, కిరణ్ లాల్, చెస్ శిక్షణ ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ్, మాలిక్ ,నరసింహ, వెంకట్,క్రీడాకారుల తల్లిదండ్రులు,వివిధ జిల్లాల సంఘాల కార్యదర్శులు, పాల్గొన్నారు.
Arattai