ఎంపీ ల్యాడ్స్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందించాలి – MP బైరెడ్డి శబరి
NANDYAL Sep :- ఎంపీ ల్యాడ్స్ (MPLADS) నిధులతో మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, మంజూరైన ప్రతిపాదనలు, పనుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ఎంపీ ల్యాడ్స్ (MPLADS) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనుల అమలులో అనవసర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. పెండింగ్ పనుల వివరాల కోసం ప్రజాప్రతినిధులు, ప్రజలు వారాల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.
పనులు చేపట్టడంలో స్థానిక సమస్యలు, ఇతర కారణాలతో జాప్యం జరుగుతున్నట్లయితే వాటిని అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు లేదా సంబంధిత ఏజెన్సీలు పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే కారణాలను స్పష్టంగా గుర్తించి, అవసరమైన నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించని లేదా పూర్తి చేయని పనులను నిబంధనల మేరకు రద్దు చేసి, ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ఇతర అభివృద్ధి పనులకు నిధులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పెండింగ్ వంతెనల పనులపై ప్రత్యేక దృష్టి
ముచ్చుమర్రి ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన వంతెన పనులపై సమీక్షిస్తూ, బిల్లుల చెల్లింపులు తదితర సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కరించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. నంద్యాల పట్టణంలోని బీసీ హాస్టల్ భవనాలకు అవసరమైన కొత్త అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన గార్బేజ్ కలెక్షన్ వాహనాలు, ట్రాక్టర్లు తదితర వాహనాల కొనుగోలుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.
నంద్యాల – శారదా విద్యాపీఠంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఎంపీ ల్యాడ్స్ కింద రూ.14.70 కోట్లతో 197 అభివృద్ధి పనులు – కలెక్టర్ రాజకుమారి
ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి రూ.490 లక్షల చొప్పున మొత్తం రూ.14.70 కోట్లు నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ జి రాజ కుమారి వివరించారు. ఇప్పటివరకు 197 పనులను సిఫార్సు చేయగా, 196 పనులకు మంజూరు లభించిందన్నారు. మిగిలిన ఒక పనికి ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి ఫీజిబిలిటీ నివేదిక అందిన అనంతరం మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంజూరైన పనుల్లో 20 పనులు ఎస్సీ ప్రాంతాల్లో, 6 పనులు ఎస్టీ ప్రాంతాల్లో, 170 పనులు ఇతర ప్రాంతాల్లో చేపట్టినట్లు వివరించారు. మంజూరైన 196 పనుల్లో ఇప్పటివరకు 113 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పనుల అమలులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా 48, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 58, పంచాయతీరాజ్ పీఐయూ ద్వారా 59, నంద్యాల మున్సిపాలిటీ ద్వారా 2, కోవెలకుంట్ల మున్సిపల్ కమిషనర్ పరిధిలో 6 పనులు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.

ఎంపీ ల్యాడ్స్ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు పెండింగ్ పనుల కారణాలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తయి, సంతృప్తికర ధ్రువీకరణ పత్రం అందిన అనంతరమే నిధుల చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సిపిఓ ప్రకాష్ పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Arattai