NANDYAL June10:- తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన స్నాతకోత్సవంలో గోస్పాడు మోడల్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ సాహితీవేత్త డా. నీలం వెంకటేశ్వర్లు తెలుగులో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. జూన్ 10వ తేది బుధవారం యూనివర్సిటీలోని శ్రీనివాసఆడిటోరియంలో జరిగిన ఈ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు ద్వారా ఎస్వీ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పీహెచ్డీ ప్రవేశం పొందిన నీలం వెంకటేశ్వర్లు ఆచార్య మేడిపల్లి రవికుమార్ పర్యవేక్షణలో “భగ్వాన్ కవిత్వం – సమాలోచన” అనే అంశంపై 2014 నుంచి 2019 వరకు పరిశోధన నిర్వహించారు. అనంతరం తన సిద్ధాంత గ్రంథాన్ని 2022లో విశ్వవిద్యాలయానికి సమర్పించారు. పరిశోధన విజయవంతంగా పూర్తికావడంతో విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో గవర్నర్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. పరిశోధనా కాలంలో 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించడం, పలు సాహిత్య మాసపత్రికలు, దినపత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురించడం డా. నీలం వెంకటేశ్వర్లు చేసిన పరిశోధనా కృషికి నిదర్శనమని ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖాధిపతి ఆచార్య రాజేశ్వరమ్మ, పరిశోధన పర్యవేక్షకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ కొనియాడారు.

సాహిత్య, సామాజిక, విద్యా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు డాక్టరేట్ పట్టా అందుకోవడం అభినందనీయమని నంద్యాల సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు కాదర్బాద్ రవీంద్రనాథ్ కళారాధన కార్యదర్శి డా.జి రవికృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. నీలం వెంకటేశ్వర్లును గోస్పాడు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఖాజా హుస్సేన్, నంద్యాలలోని వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు అన్నెం శ్రీనివాసరెడ్డి, అవ్వారి శేషఫణి, పలువురు ఉపాధ్యాయులు, సాహితీ మిత్రులు అభినందించారు.
Arattai