శ్రీకృష్ణ నిర్యాణం – పాండవ నిర్వేదం అంశంపై సాహిత్య ఉపన్యాసం…
NANDYAL June14:- శ్రీ వాసవి సాహిత్య సమితి, నంద్యాల ఆధ్వర్యంలో “శ్రీకృష్ణ నిర్యాణం – పాండవ నిర్వేదం” అనే అంశంపై ఆదివారం సాయంత్రం నూనెపల్లిలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో సాహిత్య ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.సంస్థ అధ్యక్షులు గూటూరు చంద్రశేఖరరావు, కార్యదర్శి సముద్రాల మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ అష్టావధాని డాక్టర్ గంగుల నాగరాజు ప్రధాన వక్తగా పాల్గొని శ్రీకృష్ణుని నిర్యాణానంతరం పాండవులు అనుభవించిన వైరాగ్యం, ధర్మసంకటాలు, జీవన తాత్వికతను మహాభారత దృష్టితో విశ్లేషిస్తూ శ్రోతలను ఆకట్టుకునేలా అద్భుతంగా ఉపన్యసించారు.డాక్టర్ గంగుల నాగరాజు మాట్లాడుతూ, శ్రీకృష్ణుని నిర్యాణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదని, అది ఒక యుగాంతానికి సంకేతమని పేర్కొన్నారు. పాండవులు పొందిన నిర్వేదం మానవ జీవితంలోని ధర్మబద్ధమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని వివరించారు. మహాభారతంలోని ఈ ఘట్టం నేటి సమాజానికీ విలువైన జీవన సందేశాలను అందిస్తుందని తెలిపారు. సభాధ్యక్షులు చంద్రశేఖరరావు మాట్లాడుతూ, భారతీయ ఇతిహాసాలలోని మహోన్నత విలువలను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో వాసవి సాహిత్య సమితి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్యం ద్వారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కార్యదర్శి సముద్రాల మధుసూదనరావు మాట్లాడుతూ, సాహిత్యాభిమానులకు విజ్ఞానాన్ని అందించే ఇటువంటి ఉపన్యాసాలు సమాజంలో సాహిత్య చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమ సమన్వయకర్త, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ మహాభారతంలోని గంభీరమైన తాత్విక అంశాలను సులభమైన శైలిలో శ్రోతలకు చేరవేసిన డాక్టర్ గంగుల నాగరాజును అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులు, విద్యావేత్తలు, శ్రోతలు అధిక సంఖ్యలో హాజరై ఉపన్యాసాన్ని ఆసక్తిగా ఆలకించారు.
Arattai