BANAGANA PALLE July 09 :- భూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తూ రైతులకు భద్రమైన భూ హక్కులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా గురువారం బనగానపల్లెలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి రైతులు తులసమ్మ, రామాంజనేయులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి సి.అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య, శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడం, భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం, పారదర్శకమైన భూ పరిపాలనను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో సెక్యూరిటీ ప్రెస్‌లో ముద్రిస్తున్నామని, వాటిలో క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రికార్డుల భద్రతను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తూ రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి, వారి ఆమోదంతో రికార్డులను ఖరారు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు వేలాది గ్రామాల్లో సర్వే పూర్తి చేసి లక్షలాది పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి భూ యజమానికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

వారసత్వ ఆస్తుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వేగంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో హార్టికల్చర్ రంగాన్ని విస్తరించడం, కోల్డ్ స్టోరేజ్‌లు, విలువ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని వివరించారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జలధార-జలహారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మలిచే చర్యలు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి, చెక్‌డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. నంద్యాల జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ పనులపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, మంత్రిని ఈ సందర్భంగా అభినందించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు వాట్సాప్ ఆధారిత ‘మనమిత్ర’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాలు, సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాయలసీమలో పారిశ్రామికీకరణ, హార్టికల్చర్, గ్రీన్ ఎనర్జీ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బనగానపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బనగానపల్లి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీఓ కార్యాలయాన్ని మంజూరు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో బైపాస్ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి మాట్లాడుతూ, రాయలసీమ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఒకప్పుడు కరవు, వలసలు, సాగునీటి కొరతతో గుర్తింపు పొందిన రాయలసీమ నేడు నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామికీకరణతో కొత్త దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాయలసీమ అపార అవకాశాలు కలిగిన ప్రాంతమని, ఉద్యానవన పంటలు, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల అభివృద్ధికి అనువైన ప్రాంతంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని ఉద్యానవన పంటల సాగులో గణనీయమైన భాగం రాయలసీమలోనే సాగు అవుతోందని, దీని ద్వారా సుమారు ఆరు లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. విలువ ఆధారిత వ్యవసాయం, కోల్డ్‌చైన్ మౌలిక సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ఫలితంగా కొత్త పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాయలసీమ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో మరింత ముందంజలో నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 203 గ్రామాల్లో సుమారు 1.10 లక్షల మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా 229 గ్రామాల్లో సుమారు 2.77 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని, రైతుల సహకారంతో 2027 మార్చి నాటికి జిల్లాలో 100 శాతం అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందుగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ, జిల్లాలో ఇంకా 155 గ్రామాల్లో సుమారు 8 లక్షల ఎకరాల పరిధిలో రీ-సర్వే పెండింగ్‌లో ఉందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గం తర్వాత అత్యధిక స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీపీ) కలిగిన ప్రాంతంగా బనగానపల్లి నియోజకవర్గం నిలుస్తోందని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్బీసీ) ద్వారా సుమారు 1.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున అధిక ఆదాయాన్ని అందించే ఉద్యానవన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

బనగానపల్లి ఖనిజ సంపదతో పాటు పర్యాటకాభివృద్ధికి కూడా విశేష అవకాశాలు ఉన్న ప్రాంతమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ బనగానపల్లి’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కార్యక్రమాలకు విశేష సహకారం అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 57 వేల ఎకరాల్లో సహజ వ్యవసాయం అమలులో ఉందని, దీనిని దశలవారీగా లక్ష ఎకరాలకు విస్తరించే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఉద్యానవన పంటల సాగును మరో 20 వేల ఎకరాలకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బనగానపల్లి నియోజకవర్గంతో పాటు నంద్యాల జిల్లాను వ్యవసాయం, ఉద్యానవనం, మౌలిక వసతులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి తదితర అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
Arattai